న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన వివాహితకు శ్రీసత్యసాయి జిల్లా మడకశిర పోలీస్టేషన్‌లో షాకింగ్ ఘటన ఎదురైంది. న్యాయం కోసం స్టేషన్‌కు వెళ్తే తనతో మడకశిర సీఐ రాగిరి రామయ్య అసభ్యంగా ప్రవర్తించాడని పుట్టపర్తి జిల్లా ఎస్పీకి బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. నిందితులను వదిలేసి తనను ఐదు నిమిషాలకు ఒకసారి లోపలికి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడని వాపోయింది. ఈ మేరకు బాధిత మహిళ ఒక వీడియో రిలీజ్ చేసింది.
వివరాల్లోకి వెళితే.. మడకశిర మండల పరిధిలోని టీడీపల్లితాండకు చెందిన గాయత్రి తన బంధువుల గొడవపై కంప్లయింట్ ఇవ్వడానికి పీఎస్‌కు వచ్చారు. సీఐకి కంప్లయింట్ ఇచ్చారు. నిందితులను విచరించకుండా తనను ఐదు నిమిషాలకు ఒకసారి సీఐ రామయ్య తన రూమ్‌లోకి పిలిచి డోర్ వేయమని చెప్పి గంటల తరబడి తన వ్యక్తిగత వివరాల గురించి అడుగుతున్నాడని గాయత్రి తెలిపింది. తాను ఒంటరి మహిళలను అని చెప్పినా, భర్తతో ఎందుకు విడిపోయావు..? నెక్ట్స్ పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా..? అని అడిగాడన్నారు.
భయంతో వాష్‌రూమ్ అని బయటకు వచ్చినా, ఆ సీఐ తనను మళ్లీ పిలిచి పర్సనల్ టాపిక్స్ గురించి మాట్లాడుతున్నాడన్నారు. గొడవ పడినవారిని వదిలేసి తనను వేధించాడని, ఇంటికి వెళ్లాలి చిన్న పిలలు ఉన్నారని చెప్పినా వినకుండా, ఐదు నిమిషాలు అంటూ రాత్రి 10 గంటల వరకు స్టేషన్‌లోనే ఉంచాడని బాధిత మహిళ వాపోయారు.
న్యాయం కోసం స్టేషన్‌కు వెళ్తే అధికారులే ఇలా ప్రవర్తిస్తే ఇక తాము ఎక్కడకు వెళ్లాలని బాధితురాలు ప్రశ్నించింది. సీఐ రామయ్య తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని, కావాలంటే విచారణకు ఆదేశించండి అని ఆమె కోరారు. ఈ ఘటనపై తాను ఎస్పీకి ఫిర్యాదు చేశానని, తనకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు.