ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఒక యువతి ప్రాణాలను ఆమె తండ్రే బలితీసుకోగా, ఆ ఘాతుకానికి పరోక్షంగా సహకరించిన మాచర్ల పట్టణ సీఐ తురక వెంకటరమణపై సస్పెన్షన్ వేటు పడింది. భారీ మొత్తంలో లంచం తీసుకుని, ఆమెను మృత్యువు నోటికి అప్పగించినట్లు విచారణలో తేలడంతో జిల్లా ఎస్పీ కృష్ణారావు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
పల్నాడు జిల్లాకు చెందిన చౌడేశ్వరి అనే యువతి తాను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే ఈ పెళ్లి ఇష్టం లేని ఆమె తల్లిదండ్రులు ఆమెపై కక్ష పెంచుకున్నారు. రక్షణ కోరి పోలీసులను ఆశ్రయించాల్సిన పరిస్థితుల్లో, వ్యవస్థలోని లొసుగులు ఆమెకు శాపంగా మారాయి.
విచారణలో దిగ్భ్రాంతికర అంశాల వెల్లడయ్యాయి. చౌడేశ్వరి తల్లిదండ్రుల నుంచి సీఐ వెంకటరమణ భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. మేజర్ అయిన యువతి తన ఇష్టప్రకారం జీవించే హక్కు ఉన్నప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా ఆమెను బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించాడు సీఐ వెంకటరమణ. రక్షణ కల్పించాల్సిన బాధ్యతను విస్మరించి, డబ్బు కోసం ఒక ప్రాణాన్ని పణంగా పెట్టారు.
“నాన్నా చంపొద్దు” అని వేడుకున్నా..
తల్లిదండ్రుల చెంతకు చేరిన తర్వాత చౌడేశ్వరి అనుభవించిన నరకం వర్ణనాతీతం. “నాన్నా నన్ను కొట్టొద్దు.. కావాలంటే పురుగుల మందు తాగి చచ్చిపోతా కానీ చంపొద్దు” అని ఆమె ప్రాధేయపడినా ఆ తండ్రి మనసు కరగలేదు. కూతురి గుండెలపై కూర్చుని గొంతు నులిమి అత్యంత క్రూరంగా హత్య చేశాడు. ఈ కేసులో పోలీసుల వైఫల్యంపై తీవ్ర విమర్శలు రావడంతో జిల్లా ఎస్పీ కృష్ణారావు లోతైన విచారణకు ఆదేశించారు.
సీఐ వెంకటరమణ పాత్ర ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో ఆయన్ని విధుల్లో నుంచి తొలగిస్తూ (సస్పెండ్ చేస్తూ) ఉత్తర్వులు జారీ చేశారు. చట్టాన్ని కాపాడాల్సిన వారే నేరస్థులతో చేతులు కలిపితే సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉంటుంది? చౌడేశ్వరి హత్య ఉదంతం వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది.








