తెలుగు యూట్యూబర్ అన్వేష్ (Anvesh) గురించి సోషల్ మీడియాలో పరిచయం అవసరం లేదు. ప్రపంచ పర్యాటకుడిగా పేరొందిన అన్వేష్, వివిధ దేశాల్లో తిరుగుతూ యూట్యూబ్ ద్వారా భారీ స్థాయిలో ఫాలోవర్స్‌ను సంపాదించాడు. అయితే ఇటీవల అతడు చేసిన కొన్ని వికృత చేష్టలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ముఖ్యంగా హిందూ దేవతలు (Hindu Deities), మహిళల (Women)పై చేసిన అసభ్యకర వ్యాఖ్యల కారణంగా అతనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ విదేశీ మహిళ అన్వేష్‌పై తీవ్రంగా స్పందిస్తూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసింది. “నాకు పర్మిషన్ ఇస్తే అన్వేష్‌ను భరతమాత కాళ్ల దగ్గరకు తీసుకొస్తా” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
లిడియా లక్ష్మి ఎవరు?
ఉక్రెయిన్ (Ukraine)కు చెందిన లిడియా లక్ష్మి (Lidiya Lakshmi), ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తుమ్మపాల వెంకట్ (Thummapala Venkat)ను వివాహం చేసుకున్నారు. భారతదేశ సంస్కృతి, సనాతన ధర్మం పట్ల ఆమెకు ప్రత్యేకమైన గౌరవం ఉంది. భారతీయ సంప్రదాయాలను లోతుగా అధ్యయనం చేసిన లిడియా లక్ష్మి, ధర్మంపై తన నిబద్ధతను తరచూ సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తుంటారు.
ప్రస్తుతం థాయిలాండ్ ఎంబసీలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న ఆమె, అన్వేష్ భారతీయ సంప్రదాయాలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తనకు అవకాశం ఇస్తే అన్వేష్‌ను పట్టుకుని భారత్(India)కు తీసుకొస్తానని, లేకపోతే అతడు మరో దేశానికి పారిపోయే అవకాశం ఉందని ఆమె స్పష్టం చేశారు. అన్వేష్‌ను భారత్‌కు తీసుకురావడానికి ఉన్న మార్గాలను కూడా ఆమె తన వీడియోలో వివరించారు.
పోలీసుల దర్యాప్తు, నెటిజన్ల ఆగ్రహం
ఇదిలా ఉండగా, అన్వేష్ తీరుపై నెటిజన్లతో పాటు సినీ ప్రముఖులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ దేవతలు, మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన అంశంపై పంజాగుట్ట పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆ వివాదాస్పద వీడియోలను నిజంగా అన్వేష్నే పోస్ట్ చేశాడా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌కు లేఖ రాశారు. వీడియో పోస్ట్ అయిన యూజర్ ఐడి, URL వివరాలను జతచేసి పూర్తి సమాచారం అందించాలని ఇన్‌స్టాగ్రామ్‌ను కోరారు. ఈ కేసులో తదుపరి చర్యలపై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.








