తీరంలో ఓ లగ్జరీ నౌక ప్రారంభమైన కాసేపటికే సముద్రంలో మునిగిపోవడంతో సంచలనం రేగింది. ఉత్తర టర్కీ తీరంలో ఈ ఘటన చోటుచేసుకోగా, ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సుమారు 1 మిలియన్ డాలర్ల ఖర్చుతో మెడ్ యిల్మాజ్ షిప్‌యార్డ్‌లో నిర్మించిన ఈ నౌక యజమానికి ఆ రోజే డెలివరీ ఇచ్చారు. ప్రారంభయాత్రకు బయలుదేరిన కేవలం 15 నిమిషాల్లోనే నౌక నీటిలో మునిగిపోవడం సంచలనంగా మారింది.
ఆ సమయంలో నౌకలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది భయంతో సముద్రంలోకి దూకగా, అదృష్టవశాత్తూ వారంతా సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. నౌక యజమాని, కెప్టెన్ కూడా వారితో పాటు బయటపడ్డారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నౌక మునిగిపోవడానికి గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు.
ఇదిలా ఉంటే, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోను చూసిన నెటిజన్లు, “ఇది ఏఐ వీడియో అనుకుంటా?”, “ఇంత ఖరీదైన నౌక ఎలా మునిగిపోయింది?” అంటూ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.







