ఢిల్లీ (Delhi)లోని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) భవన్‌లో మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) నిర్వహించిన మీడియా సమావేశం పెద్ద వివాదానికి దారితీసింది. విశాఖపట్నం (Visakhapatnam)లో జరగబోయే పెట్టుబడుల సదస్సు నేపథ్యంతో ఏర్పాటు చేసిన ఈ ప్రెస్‌మీట్‌లో తెలుగు మీడియా (Telugu Media) ప్రతినిధులను అవమానించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన తెలుగు మీడియా ప్రతినిధులను “మీడియా సమావేశానికి మీరెందుకు వచ్చారు?” అంటూ లోకేష్ ప్రశ్నించారని, “మీరు తెలుగు క్వశ్చన్స్ వేస్తే కుదరదు రా.. బై” అంటూ దురుసుగా మీడియా ప్రతినిధులపై ప్రవర్తించారని అక్కడి జర్నలిస్ట్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రెస్‌మీట్‌కు వచ్చిన మీడియా ప్రతినిధులను నారా లోకేష్ అవమానించారని, దీంతో పలువురు మీడియా ప్రతినిధులు మీడియా సమావేశాన్ని బాయ్ కాట్ చేసినట్లు సమాచారం. తెలుగు మీడియాకు అనుమతి లేదని ఐ అండ్ పీఆర్ అధికారులు బహిరంగంగానే వెల్లడించి, పలువురు మీడియా ప్రతినిధులను సీట్లలో నుంచి లేపి బయటకు పంపినట్లుగా తెలుస్తోంది. దీంతో మహిళా జర్నలిస్టులు తీవ్ర ఆవేదనకు గురైనట్లుగా సమాచారం.
తెలుగు మీడియా పట్ల ఈ తీరుపై జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల సదస్సు గురించి మాట్లాడే సమావేశానికి తెలుగు మీడియాను అడ్డుకోవడం అవమానం” అంటూ పలువురు మీడియా ప్రతినిధులు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, మహిళా జర్నలిస్టులలో కొందరిని సీట్ల నుండి లేపి బయటకు పంపడంపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ఏపీ భవన్‌లో తెలుగు మీడియాను నిరాకరించడం సరైన పద్ధతి కాదని జర్నలిస్టులు, నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.







