ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో నకిలీ మద్యం (Fake Liquor) తయారీ కేసు సంచలనం సృష్టిస్తోంది. వైసీపీ ప్రభుత్వాన్ని గతంలో “లిక్కర్ స్కాం” (Liquor Scam) అంటూ విమర్శించిన టీడీపీ నేతలే ఇప్పుడు అక్రమ మద్యం తయారీలో చిక్కుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు కేంద్రంగా సాగిన ఈ కుంభకోణం వెనుక పెద్ద పెద్ద నేతల ప్రమేయం ఉన్నట్టు ఎక్సైజ్ అధికారుల దర్యాప్తులో బయటపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న ఈ కేసులో మరిన్ని కీలక ఆధారాలు బయటకు వస్తున్నాయి.
తంబళ్లపల్లె టీడీపీ(TDP) ఇన్‌చార్జి జయచంద్రారెడ్డి, సీనియర్ నేత సురేంద్ర నాయుడు ఈ కేసులో కీలకంగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. నకిలీ మద్యం తయారీ కేంద్రంపై ఎక్సైజ్ అధికారులు దాడులు జరిపిన సమయంలో, అక్కడి నుంచి ఒక డైరీ స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీ ఇప్పుడు కేసులో కీలక ఆధారంగా మారింది. అందులో నకిలీ మద్యం కొనుగోలు చేసిన బెల్ట్‌షాపుల నిర్వాహకుల పేర్లు, గూగుల్ పే, ఫోన్‌పే లావాదేవీల వివరాలు రికార్డ్ చేయబడ్డాయని సమాచారం. ఆ జాబితాలో సుమారు 78 మందికి పైగా పేర్లు ఉండగా, వారిలో కొందరు రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారని తెలుస్తోంది.
డైరీలో పేర్లు ఉన్న వ్యక్తులపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బి.కొత్తకోట, కురబలకోట ప్రాంతాలకు చెందిన బెల్ట్‌షాప్ నిర్వాహకులు, మాజీ ప్రజా ప్రతినిధుల పేర్లు కూడా అందులో ఉన్నట్లు సమాచారం. వీరంతా ములకలచెరువు కేంద్రంగా నకిలీ మద్యం సరఫరా నెట్‌వర్క్‌లో భాగమని అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ కేసులో కీలకంగా ఉన్న వ్యక్తి జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడులను తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది.
ఎన్టీఆర్ జిల్లాకు లింకులు
ఇక ఈ కుంభకోణం లింకులు చిత్తూరు జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లా వరకు విస్తరించాయి. ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఏ1గా ఉన్న ఎన్టీఆర్ జిల్లా టీడీపీ నేత అద్దేపల్లి జనార్ధన్ పేరుపై దర్యాప్తు కొనసాగుతోంది. మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్‌లో అద్దేపల్లి జనార్ధన్‌కు చెందిన ఏఎన్‌ఆర్ బార్‌పై ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి, భారీగా మద్యం స్టాక్‌ను సీజ్ చేశారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నప్పటికీ, ఎక్సైజ్ శాఖ అతని ఆస్తులు, ఆర్థిక లావాదేవీలపై సమగ్ర విచారణ చేపట్టింది.









