క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రేమ కథ చాలామందికి తెలిసిందే. తనకంటే రెండేళ్లు పెద్దదైన అంజలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 1990లో మొదటిసారి ఎయిర్‌పోర్ట్‌లో కలుసుకున్న వీరిద్దరూ 1995లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇప్పుడు సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
గత కొన్నేళ్లుగా టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్తో సారా టెండూల్కర్ ప్రేమలో ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి రెస్టారెంట్లు, పార్టీలలో కనిపించడం, శుభ్‌మన్ గిల్ మ్యాచ్‌లకు సారా హాజరవ్వడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. ఈ విషయంపై సచిన్ కుటుంబం ఇంతవరకు స్పందించకపోయినా, శుభ్‌మన్ గిల్ మాత్రం తమ మధ్య ఏమీ లేదని చెబుతున్నారు. అయితే, ఇటీవల యువరాజ్ సింగ్ నిర్వహించిన ఒక స్వచ్ఛంద కార్యక్రమానికి ఇద్దరూ కలిసి హాజరవడంతో ఈ డేటింగ్ వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి.
సారా, శుభ్‌మన్ గిల్ ప్రేమ గురించి వారి కుటుంబాలకు తెలుసని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని కూడా కొన్ని కథనాలు వస్తున్నాయి. వయసులో సారా కంటే శుభ్‌మన్ గిల్ రెండేళ్లు చిన్నవాడు. ప్రస్తుతం సారా వయసు 27 ఏళ్లు కాగా, గిల్ వయసు 25 ఏళ్లు. ప్రస్తుతం వీరిద్దరూ తమ కెరీర్‌పై దృష్టి పెట్టారు. సారా మోడలింగ్‌లో రాణించాలని ప్రయత్నిస్తుండగా, గిల్ టీమిండియా కెప్టెన్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు కృషి చేస్తున్నారు.







