మలయాళ సాహిత్య ప్రముఖుడు, రచయిత, డైరెక్టర్ ఎంటీ వాసుదేవన్ నాయర్ (91) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణ వార్తకు కేరళ రాష్ట్రం శోకసంద్రంలో మునిగిపోయింది. కేరళ సీఎం పినరయి విజయన్ ఆయన మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, నేడు, రేపు సంతాప దినాలుగా ప్రకటించారు.
జ్ఞానపీఠ అవార్డు గ్రహీత..
ఎంటీ వాసుదేవన్ నాయర్ మలయాళ సాహిత్యానికి చేసిన సేవలకుగానూ 1995లో జ్ఞానపీఠ అవార్డు వరించింది. ఆయన రచనలు మలయాళ సాహిత్యానికి నూతన ప్రాచుర్యాన్ని తెచ్చాయి. అనేక నవలలు, కథలు, స్క్రిప్టులు రాయడంతో పాటు కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు.
సినీ రంగంలో విశేష కృషి
ఎంటీ వాసుదేవన్ నాయర్ మలయాళ చిత్ర పరిశ్రమలో స్క్రిప్ట్ రైటర్, దర్శకుడిగా అపార సేవలందించారు. ఆయన నాలుగు సినిమాలకు నేషనల్ అవార్డులు లభించాయి. తన రచనల ద్వారా మానవ సంబంధాలు, భావోద్వేగాలు, సాంఘిక అంశాలను గొప్పగా ప్రతిబింబించారు. వాసుదేవన్ మరణం మలయాళ సాహిత్య, సినీ రంగాలకు తీరని లోటుగా సినిమా ప్రేమికులు చెప్పుకుంటున్నారు.