కూకట్‌పల్లి హత్య: జార్ఖండ్‌కు చెందిన వంట మనిషి, స్నేహితుడే నిందితులు

కూకట్‌పల్లి హత్య: జార్ఖండ్‌కు చెందిన వంట మనిషి, స్నేహితుడే నిందితులు

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉన్న స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. బుధవారం తన ఇంట్లో రక్తపు మడుగులో కనిపించిన రేణు అగర్వాల్‌ను ఆమె వంట మనిషి, అతని స్నేహితుడు కలిసి అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇద్దరు నిందితులు హర్ష, రోషన్‌లు జార్ఖండ్‌కు చెందినవారు.

ఈ కేసు వివరాల్లోకి వెళితే, మృతురాలి కుటుంబానికి ఫతేనగర్‌లో స్టీల్ దుకాణం ఉంది. రేణు ఇంట్లో రోషన్‌ అనే యువకుడు వంట మనిషిగా పని చేస్తున్నాడు. ఇటీవల రోషన్ తన స్నేహితుడైన హర్షను కూడా జార్ఖండ్ నుంచి రప్పించి, రేణు ఇంట్లో పనిలో చేర్చాడు.

బుధవారం ఉదయం రేణు భర్త రాకేష్, కొడుకు శుభం దుకాణానికి వెళ్లగా రేణు ఇంట్లో ఒంటరిగా ఉంది. సాయంత్రం సమయంలో ఫోన్‌ చేసినా రేణు స్పందించకపోవడంతో రాకేష్ ఇంటికి వచ్చారు. తలుపు వేసి ఉండటంతో ప్లంబర్‌ను పిలిపించి వెనుక వైపు నుంచి లోపలికి పంపించగా, రేణు చేతులు, కాళ్ళు కట్టేసి రక్తపు మడుగులో కనిపించింది.

పోలీసుల దర్యాప్తులో, హర్ష, రోషన్‌లు ఈ హత్య చేసినట్లు వేలిముద్రల ద్వారా గుర్తించారు. బంగారం, డబ్బు కోసం ఆమెను చిత్రహింసలకు గురిచేసి, తలపై కుక్కర్‌తో కొట్టి, కూరగాయలు కోసే కత్తితో గొంతు కోసి చంపినట్లు వెల్లడించారు. హత్య తర్వాత, ఆమె శరీరంపై ఉన్న నగలు, డబ్బుతో సూట్‌కేసులో పెట్టుకొని పారిపోయారు. పారిపోయే ముందు తమ దుస్తులపై ఉన్న రక్తపు మరకలను శుభ్రం చేసుకొని, ఇంటి యజమానికి చెందిన స్కూటీపై పరారయ్యారు. సీసీటీవీ ఫుటేజీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రస్తుతం కూకట్‌పల్లి పోలీసులు ఐదు బృందాలుగా విడిపోయి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment