వరంగల్ జిల్లా జనగామ (Jangaon) వేదికగా జరిగిన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) చేసిన ప్రసంగం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ప్రజాకవి కాళోజీ నారాయణరావు (Kaloji Narayana Rao) మాటలను గుర్తు చేస్తూ “కాలం వచ్చినప్పుడు కసిదీర కాటేయాలే” అని వ్యాఖ్యానించిన కేటీఆర్, ప్రజలు ఆ సమయానికి సిద్ధంగా ఉన్నారని ఉద్ఘాటించారు.
కడియం శ్రీహరిని ఎలాంటి రాజకీయ బలం లేకపోయినా ఉప ముఖ్యమంత్రిని చేసిన ఘనత బీఆర్ఎస్(BRS)దేనని, కానీ తన కుమార్తె రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన పార్టీకి ద్రోహం చేసి రేవంత్ రెడ్డితో చేతులు కలిపారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి కనీస భౌగోళిక అవగాహన కూడా లేదని ఎద్దేవా చేస్తూ, దేవాదుల ప్రాజెక్టు ఏ నదిపై ఉందో కూడా తెలియని వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్(KCR)పై చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ తీవ్రంగా ప్రతిస్పందించారు. తెలంగాణ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన కేసీఆర్‌ను ఉరితీయాలని మాట్లాడటం సిగ్గుచేటని, 70 లక్షల మంది రైతులను మోసం చేసిన రాహుల్ గాంధీపై మాట్లాడే అర్హత రేవంత్‌కు లేదని విమర్శించారు. రాహుల్ గాంధీ నాయకుడు కాదని, ఇతరులు రాసిచ్చినది చదివే ‘రీడర్’ మాత్రమేనని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ గౌరవ సభలా కాకుండా కౌరవ సభలా మారిందని ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్, కేసీఆర్ ఒకే ఒక్క ప్రెస్‌మీట్ పెట్టినా ముఖ్యమంత్రికి భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నాయకులు కాలగర్భంలో కలిసిపోయినట్టు గుర్తు చేస్తూ, రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అంతేనని జనగామ వేదికగా హెచ్చరించారు.








