బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు నల్లగొండలో భారీ రైతు మహాధర్నా జరగనుంది. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. మాజీ మంత్రి గుంటకంట్ల జగదీశ్‌రెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, రైతులు ఈ ధర్నాలో పాల్గొనబోతున్నారు.
నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్‌లో ఈ మహాధర్నా నిర్వహించనున్నారు. పోలీసులు మూడు గంటల సమయం (ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు) మాత్రమే అనుమతిచ్చారు. బీఆర్‌ఎస్ పార్టీ ఈనెల 12న మహాధర్నా నిర్వహించాల్సి ఉండగా, సంక్రాంతి పండుగ కారణంగా ఈ రోజుకు వాయిదాపడింది.
పోలీసుల అనుమతి కోసం పోరాటం
మహాధర్నాకు పూర్వం 21వ తేదీని నిర్ణయించినా, పోలీసులు అనుమతిచ్చేందుకు నిరాకరించారు. దీంతో బీఆర్‌ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు ధర్నా నిర్వహణకు అనుమతిచ్చింది. 1500 మందితో ఎన్టీఆర్ విగ్రహం నుంచి క్లాక్ టవర్ వరకు ర్యాలీ నిర్వహించేందుకు, ఆ తరువాత ధర్నా నిర్వహించేందుకు అనుమతిచ్చారు.
రైతులను ఆత్మహత్యలు, రుణ మాఫీ, సన్న ధాన్యానికి బోనస్ వంటి అంశాలను మహాధర్నా వేదికగా రేవంత్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రశ్నించనుంది. కేటీఆర్ నాయకత్వంలో నల్లగొండ నుంచి రైతుల హక్కుల కోసం గళం వినిపించేందుకు ఈ మహాధర్నా చేపట్టనున్నట్లు బీఆర్ఎస్ పేర్కొంది.