తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధి ఆగిపోయిందని, బీజేపీ, కాంగ్రెస్ నేతలు దీనిపై మౌనం పాటించడం దారుణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన కేటీఆర్, ప్రధానంగా బయ్యారులో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయకుండా కేంద్రం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. అంతేకాకుండా, ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఫ్యాక్టరీను వేలానికి పెట్టడం అన్యాయమని మండిపడ్డారు.
బీజేపీ, కాంగ్రెస్‌లపై నిప్పులు
తెలంగాణలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నా పరిశ్రమల సమస్యలపై ఒక్కరు కూడా స్పందించలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అదే విధంగా, కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది మంది ఎంపీలు, 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నా వారు కూడా కేంద్రం అనుసరిస్తున్న విధానాలను ప్రశ్నించలేదని విమర్శించారు.
తెలంగాణలో కొత్త పరిశ్రమలు తీసుకురావాల్సిన నేతలు లేకపోవడమే కాదు, ఇప్పటికే ఉన్న పరిశ్రమలను కాపాడే దిశగా ఎవ్వరూ ఆలోచించడంలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలను కూల్చేందుకు కాంగ్రెస్, వాటిని వేలానికి పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
ప్రజలు గళమెత్తాలి
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని కేటీఆర్ విమర్శించారు. వీరికి పరిశ్రమల అభివృద్ధి కంటే ఓట్లు, సీట్లు ముఖ్యమని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు తమ హక్కుల కోసం నిలబడి, పరిశ్రమలను కాపాడుకునేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.