ఫార్ములా ఈ-రేస్ కేసులో హైకోర్టు ఉత్తర్వుల అనంతరం ఇవాళ మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. సభలో జరిగిన చర్చలో అధికార పక్షాన్ని ఉద్దేశిస్తూ కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఫార్ములా ఈ-రేస్ ఈ కేసులో కేటీఆర్‌ను ఏ-1 గా పేర్కొంటూ ఫిర్యాదు నమోదు కావడంతో అరెస్టు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ, కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించి, తమపై ఉన్న కేసును కొట్టివేయమని క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఈ నెల 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయకూడదని తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది.
అసెంబ్లీలో కేటీఆర్ వ్యాఖ్యలు
హైకోర్టు తీర్పుతో తాత్కాలిక రిలీఫ్ పొందిన కేటీఆర్ అసెంబ్లీలో రైతు భరోసా చర్చకు హాజరై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఈ రాష్ట్రంలో ఏ ఊరిలోనైనా 100% రుణమాఫీ నిరూపిస్తే, వెంటనే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా” అని ప్రకటించారు. కేటీఆర్ ఈ వ్యాఖ్యలతో ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చినట్లయ్యింది.
ఏసీబీ దూకుడు, ఈడీ ఎంట్రీతో కొత్త మలుపు
ఫార్ములా ఈ-రేస్ కేసులో విచారణ కొనసాగించేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఫిర్యాదు దారుడైన దానకిశోర్ నుంచి సాక్ష్యాలు సేకరించి ఏసీబీ తదుపరి విచారణకు సిద్ధమైంది. మరోవైపు, ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా విచారణలో చేరడంతో ఉత్కంఠ మరింత పెరిగింది.








