జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దూకుడు పెంచారు. శుక్రవారం షేక్‌పేట్‌లో నిర్వహించిన భారీ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేలాది మంది కార్యకర్తలు, స్థానిక ప్రజలు కేటీఆర్ జయహో, కారు గుర్తుకే ఓటు అంటూ నినాదాలు చేశారు.
పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా మాట్లాడిన కేటీఆర్, “కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటే, బీఆర్‌ఎస్ విజయయాత్ర జూబ్లీహిల్స్ నుంచే మొదలవ్వాలి” అని పిలుపునిచ్చారు. 2023 ఎన్నికల్లో హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదని గుర్తు చేస్తూ, దివంగత మాగంటి గోపీనాథ్ స్ఫూర్తితో ఆయన సతీమణి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన కేటీఆర్, “హిట్లర్ నశించడాన్ని చూశాం. జూబ్లీహిల్స్ ఓటమి తర్వాత ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం” అని జోస్యం చెప్పారు. ఇందిరమ్మ రాజ్యమంటే పేదల ఇళ్లు కూల్చడమా అని ప్రశ్నిస్తూ, రేవంత్ రెడ్డి పేదోళ్లను రోడ్డున పడేస్తున్నారని విమర్శించారు. అనంతరం మాట్లాడిన అభ్యర్థి మాగంటి సునీత, జూబ్లీహిల్స్ తనకు ఒక కుటుంబమని, తన భర్త గోపీనాథ్ బాటలోనే ప్రజల సమస్యలకు అండగా నడుస్తానని, ఎవరికి భయపడనని, ప్రజలకు బీఆర్‌ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.








