కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB) ప్రత్యేక సమావేశం సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో జరగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల నీటి పంపిణీ, అక్రమ నీటి వినియోగం వంటి అంశాలపై కేఆర్ఎంబీ ఛైర్మన్ అతుల్ జైన్ (Atul Jain) సమక్షంలో చర్చించనున్నారు.
తెలంగాణ వాదన..
శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీటిని తరలిస్తోంది అని తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఏపీ ధోరణిపై లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. 2024 నవంబర్ నుంచి ప్రతినెలా ఫిర్యాదులు చేసినప్పటికీ, కేఆర్ఎంబీ పట్టించుకోకపోవడం వల్ల సమస్య మరింత జఠిలంగా మారింది. ఉమ్మడి జలాశయాల నుండి ఏకపక్షంగా నీటిని తరలించే హక్కు ఏపీకి లేదని స్పష్టంగా ప్రశ్నించారు.
నీటి సమస్యపై గట్టి డిమాండ్లు
2024 మే నెలాఖరు వరకు తెలంగాణకు తాగు, సాగునీటి అవసరం 107 టీఎంసీలు అని రాహుల్ బొజ్జా తెలిపారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో 13 లక్షల ఎకరాల్లో రబీ పంటల రక్షణ, హైదరాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలకు తాగునీటి సరఫరా కోసం 116 టీఎంసీల నీటి విడుదలకు డిమాండ్ చేశారు. అందుబాటులో ఉన్న 72 టీఎంసీల నీటి విడుదలకు తక్షణ ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేశారు.
ఏపీ నీటి వినియోగంపై ఆరోపణలు
విభజన అనంతరం కుదిరిన 66:34 ఒప్పంద నిష్పత్తిని ఏపీ ఉల్లంఘించి 75:25 నిష్పత్తిలో నీటిని వినియోగిస్తోంది. ఇప్పటికే ఏపీ 650 టీఎంసీలు, తెలంగాణ కేవలం 225 టీఎంసీలు మాత్రమే ఉపయోగించుకున్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఈ సమావేశంలో బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం మళ్లీ వేడెక్కనుంది.