తెలంగాణ (Telangana) మంత్రి కొండా సురేఖ (Konda Surekha) మాజీ ఓఎస్డీ (OSD) సుమంత్ (Sumanth) వ్యవహారంపై నెలకొన్న ఉద్రిక్తతపై ఆమె భర్త, కాంగ్రెస్ నేత కొండా మురళి(Konda Murali) స్పందించారు. హనుమకొండ (Hanumakonda)లో మీడియాతో మాట్లాడుతూ, సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy)తో తమ కుటుంబానికి ఎలాంటి విభేదాలు లేవని, రేవంతన్న సీఎం కావాలని తాము ఎంతో కష్టపడ్డామని చెప్పారు. సుమంత్ వ్యవహారంలో ఏం జరిగిందో తనకు తెలియదని, మంత్రి కార్యాలయానికి ఒక్కసారే వెళ్లానని మురళి తెలిపారు. రేవంత్‌రెడ్డిని వైఎస్సార్(YSR) తర్వాత మరో వైఎస్సార్‌గా అభివర్ణించారు. మీడియా ముందు మాట్లాడొద్దని ఏఐసీసీ (AICC) ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) సూచించారని, ఆమె చెప్పినట్లు తాను వింటానని పేర్కొన్నారు.
సిమెంట్ కంపెనీలను బెదిరించిన ఆరోపణలతో సుమంత్‌ను ప్రభుత్వం తొలగించగా, బుధవారం రాత్రి సుమంత్ కోసం పోలీసులు మంత్రి సురేఖ ఇంటికి రావడం, వారిని సురేఖ కుమార్తె సుస్మిత అడ్డుకోవడం తీవ్ర హైడ్రామాకు దారితీసింది. ఈ పరిణామాలపై స్పందించిన కొండా మురళి, తనను టార్గెట్ చేస్తే వారికే నష్టమని హెచ్చరించారు. తన కుమార్తె ఇబ్బంది పడిందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ హామీ ఇచ్చారని, తప్పకుండా ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కొండా మురళి హామీ ఇచ్చారు. మీనాక్షి నటరాజన్‌ను మళ్లీ కలిసి అన్ని విషయాలు చర్చిస్తానని, పోలీసులు మంత్రి ఇంటికి ఎందుకు వచ్చారో తెలుసుకుని తదుపరి చర్యలు తీసుకుంటానని చెప్పారు. పీసీసీ అధ్యక్షులు మరియు సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించేలా చూస్తానని, ఎవరి తప్పు ఉన్నా సమస్యకు ఫుల్ స్టాప్ పడేలా చేస్తానని మురళి స్పష్టం చేశారు.








