“కొబ్బరి (Coconut) లేనిదే భారతీయ (Indian) సంస్కృతి (Culture) లేదు. మన సంస్కృతి, సంప్రదాయంలో భాగమైన కొబ్బరిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిదీ” అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. కొబ్బరి చెట్టుని నమ్ముకొని జీవనం సాగిస్తున్న రైతు రోడ్డున పడకూడదని, కొబ్బరి రైతు సమస్యలతో రోడ్డెక్కే పరిస్థితి రాకూడదని స్పష్టం చేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ (Dr. B.R. Ambedkar) కోనసీమ జిల్లాలో కొబ్బరి రైతుల సమస్యలను పరిశీలించిన పవన్ కళ్యాణ్, వారికి పూర్తి భరోసా ఇచ్చారు.
కోనసీమ కొబ్బరి రైతుల (Coconut Farmers) సమస్యలపై సమగ్ర అధ్యయనం చేసి, 45 రోజుల్లో శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషిస్తామని, సంక్రాంతి తర్వాత స్పష్టమైన యాక్షన్ ప్లాన్‌తో ముందుకు వస్తామని హామీ ఇచ్చారు. కోనసీమ కొబ్బరి రైతు వెనుక కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ (Irrigation), ఉద్యాన శాఖ (Horticulture Department) అధికారులను ప్రశ్నిస్తూ శంకరగుప్తం (Shankaraguptha) డ్రెయిన్‌పై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తరువాత పంట నష్టపోయిన 13 గ్రామాల ప్రజలతో ముఖాముఖీ సమావేశం నిర్వహించి, వారి సమస్యలను విన్నారు. “సమస్యలను పైపైగా చూసి వెళ్లిపోతే పరిష్కారం రాదు. మూలాల నుంచి అవగాహన తెచ్చుకుంటే తప్ప శాశ్వత పరిష్కారం దొరకదు” అని పవన్ కళ్యాణ్ అన్నారు. కోనసీమ కొబ్బరి రైతుల కష్టాన్ని తగ్గించేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు వస్తామని, ప్రభుత్వం తరఫున సాధ్యమైనంత పూర్తిస్థాయి సహాయం అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.








