క్రమశిక్షణ కమిటీ ముందు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ విచారణ పూర్తయింది. అధిష్టానం పిలుపు మేరకు విచారణకు హాజరైన కొలికపూడిపై కమిటీ ఇటీవల జరిగిన పరిణామాలపై ప్రశ్నల వర్షం కురిపించింది. విచారణ అనంతరం కమిటీ సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కొలికపూడి పార్టీ లైన్ దాటుతున్నట్లు తెలుస్తోందని వ్యాఖ్యానించారు. వ్యవహార శైలిని ఆయన మార్చుకోవాల్సిన అవసరం ఉందని, అందరితో కలిసిపోయి ముందుకెళ్లాలన్నారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌పై క్రమశిక్షణ కమిటీ నివేదికను పార్టీ అధినేతకు అందజేస్తామని, చంద్రబాబు నిర్ణయం మేరకు చర్యలుంటాయని వర్ల రామయ్య చెప్పారు.
ఎమ్మెల్యే వివరణ..
క్రమశిక్షణ కమిటీ ఎదుట విచారణ ముగిసిన అనంతరం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. తాను రాతపూర్వకంగా వివరణ ఇచ్చానని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వేరు, వాస్తవం వేరని చెప్పారు. కంచె తొలగింపు యాదృచ్చికంగా జరిగిందని, ఫిర్యాదు చేసిన వాళ్లే ఇవాళ తనతో కలిసి పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. వాస్తవాలన్నీ తిరువూరు ప్రజలకు తెలుసని చెప్పారు.