ఇంగ్లండ్ (England)లో అద్భుత ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ (KL Rahul) ఐపీఎల్ (IPL) 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) (KKR) తరఫున ఆడే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాహుల్‌ను ట్రేడ్ ద్వారా దక్కించుకునేందుకు కేకేఆర్ సిద్ధంగా ఉందని, ఇందుకోసం ఏకంగా రూ.25 కోట్ల వరకు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది.
కేకేఆర్‌కు ప్రస్తుతం ఓ సమర్థవంతమైన కెప్టెన్ అవసరం. గత సీజన్లో జట్టు ప్రదర్శన నిరాశపరచడంతో, కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా నియమించాలని కేకేఆర్ భావిస్తున్నట్లు సమాచారం. బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గా, వికెట్ కీపర్ (Wicket Keeper)గా రాణించగల సత్తా రాహుల్‌కు ఉండటంతో, కేకేఆర్ అతడిపై భారీ మొత్తాన్ని వెచ్చించేందుకు సిద్ధంగా ఉంది.
ఐపీఎల్ 2025 వేలానికి ముందు శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer)ను రిటైన్ చేసుకోకపోవడం కేకేఆర్ చేసిన పెద్ద తప్పిదంగా విమర్శలు వెల్లువెత్తాయి. అయ్యర్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా మారడంతో కేకేఆర్ జట్టులో నాయకత్వ సమస్య ఏర్పడింది. ప్రస్తుతం హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్‌ను కూడా తొలగించిన కేకేఆర్, జట్టు బ్యాలెన్స్‌ను సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగానే కేఎల్ రాహుల్‌ను లక్ష్యంగా చేసుకుంది. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ రాహుల్‌ను రిలీజ్ చేస్తుందా? అనేది చూడాలి.