యువ హీరో కిరణ్ అబ్బవరం తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 2019లో ‘రాజావారు రాణిగారు’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన కిరణ్, తన కష్టపడి విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం ‘దిల్ రుబా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ సినిమా ప్రమోషన్ల సందర్భంగా, తన కెరీర్ గురించి, వ్యక్తిగత ఆసక్తుల గురించి ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు. “నేను నటుడిని కాకపోతే ఖచ్చితంగా రాజకీయాల్లోకి వెళ్లేవాడిని” అని కిరణ్ స్పష్టం చేశాడు.
చిన్ననాటి నుంచి రాజకీయాలపై మక్కువ
“రాయలసీమ వాతావరణంలో పెరిగిన నేను చిన్నప్పటి నుంచే రాజకీయాలను చాలా దగ్గరగా గమనించాను. ప్రజలతో కలిసిమెలిసి ఉండడం నాకు ఇష్టం. ప్రజాసేవ చేయాలని ఎప్పుడూ అనుకునేవాడిని. కానీ, సినిమాల పట్ల కూడా చాలా ఆసక్తి ఉండడంతో ఈ రంగంలోకి వచ్చాను. ఒకవేళ సినిమాల్లోకి రాకపోతే, ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండేవాడిని” అని చెప్పాడు.
త్వరలో అధికారిక ప్రకటన
ఇక భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుతూ వ్యాపార రంగంలో అడుగు పెట్టాలని, ప్రత్యేకంగా రాయలసీమ స్టైల్ ఆహారాన్ని అందరికీ అందించాలనే ఉద్దేశం ఉందని చెప్పాడు. “ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే జరుగుతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన ఇస్తాను” అని వివరించాడు.








