పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్‌కు చెందిన ఒక నేతను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఖర్గే యూపీ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్‌తో పాటు మరో ఇద్దరు నేతలతో మాట్లాడుతున్న వీడియో బయటకు వచ్చింది.
వైరల్ వీడియోలో ఖర్గే మాట్లాడుతూ, ‘ఆ హైదరాబాద్ వాడిని రానివ్వొద్దు.. అతను వస్తే మనల్ని ఖతం చేస్తాడు’ అని ఆందోళన వ్యక్తం చేశారు. అంతే కాదు, ‘హైదరాబాద్ అంటే షేర్వానీ.. బిర్యానీ.. పరేషానీ’ అని కూడా పేర్కొన్నారు.
ఖర్గే ఎవరి పేరును నేరుగా ప్రస్తావించరాత్రప్పటికీ, నెటిజన్లు ఈ వ్యాఖ్యలు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి సంబంధించినవని ఊహిస్తున్నారు. ముస్లిం ఓటు బ్యాంక్ ఉన్న నేతలతో ఈ సంభాషణ జరగడం వెనుక రాజకీయ ప్రాధాన్యత ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఈ వీడియోపై తీవ్ర చర్చ జరుగుతోంది. ‘ఖర్గేకు హైదరాబాద్ అంటే భయం ఎందుకు?’ ‘ఒవైసీ పేరు చెప్పకుండానే భయాన్ని బయటపెట్టారు’ అంటూ నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. పార్లమెంట్ బయట ఈ ‘ఆఫ్ ది రికార్డ్’ సంభాషణ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.







