ఏపీ మాజీ సీఎం (Former AP Chief Minister), వైసీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) పుట్టినరోజు సంబరాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. అయితే, ఖమ్మం (Khammam)లో నిర్వహించిన ర్యాలీ(Rally)లో పాల్గొన్న జగన్ అభిమానులపై కేసు నమోదైంది. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ఘటనపై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించగా, ఈ ర్యాలీలో పాల్గొన్నారన్న కారణంతో మొత్తం 11 మంది అభిమానులపై పోలీసులు క్రిమినల్ కేసులు (Criminal Cases) నమోదు చేశారు. వీరిలో ఎనిమిది మందిని 13 రోజుల పాటు రిమాండ్‌కు పంపడం తీవ్ర వివాదానికి దారి తీసింది.
ఈ ఘటన వెనుక కాంగ్రెస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) కుమారుడు యుగంధర్ (Yugandhar)ప్రమేయం ఉందని జగన్ అభిమానులు (Jagan Fans) ఆరోపిస్తున్నారు. రాజకీయ ఒత్తిడితోనే పోలీసులు తమకు నచ్చిన విధంగా కేసులు నమోదు చేశారని, ఇది పూర్తిగా కక్షపూరిత చర్య అని విమర్శిస్తున్నారు. ఏపీ నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు తుమ్మల తన కుమారుడితో కేసులు నమోదు చేయించారనే చర్చ జరుగుతోంది.
21వ తేదీన జగన్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానుల ర్యాలీ నిర్వహించారు. దారిలో టీడీపీ కార్యాలయం వద్ద నుంచి వెళ్లే సమయంలో అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు ఏపీకి చెందిన టీడీపీ(TDP) నేతల వీడియోలను చూపిస్తూ కావాలనే కవ్వింపులకు దిగినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఎలాంటి ప్రతిచర్య లేకుండా జగన్ అభిమానులు ర్యాలీని కొనసాగించారు.
అయితే తిరిగి వచ్చే సమయంలో టీడీపీ కార్యాలయం ఎదుట రోడ్డుపై ఉన్నవారు మరోసారి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారని జగన్ అభిమానులు చెబుతున్నారు. ఈ క్రమంలో వారు “జై జగన్”(Jai Jagan) అంటూ నినాదాలు చేయగా, అదే కారణంగా దీన్ని ఆసరాగా చేసుకుని టీడీపీ కార్యాలయం లోపలికి వెళ్లి వాచ్‌మన్‌ను దూషించారు, ఆఫీసును ధ్వంసం చేశారు అంటూ వాచ్‌మన్ చేత ఫిర్యాదు చేయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ ఘటనలో నిజానిజాలు పక్కనపెట్టి, అభిమాన నేత పుట్టినరోజు ర్యాలీలో పాల్గొన్నందుకే యువకులను జైలుకు పంపడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ముఖ్యంగా మంత్రి కుమారుడి జోక్యంతోనే ఈ కేసులు నమోదయ్యాయన్న ఆరోపణలు మరింత రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. మొత్తంగా ఈ వ్యవహారం రాజకీయ కక్ష సాధింపుగా మారిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.








