ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండగా, రాజకీయ పార్టీల ప్రచారాలు హోరెత్తుతున్నాయి. ఈ సారి ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ మరింత ఉత్కంఠ రేపుతోంది. మొత్తం 70 స్థానాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ముఖ్యమంత్రి పదవిని సొంతం చేసుకోవడానికి ఎన్నో హామీలతో ముందుకొచ్చారు.
అర్చకులు, గురుద్వారా గ్రంథీలకు నెలకు రూ.18,000 గౌరవ వేతనం అందించే పూజారీ గ్రంథీ సమ్మాన్ యోజన పథకాన్ని ఇటీవల ప్రకటించిన కేజ్రీవాల్, విద్యార్థుల కోసం రెండు ప్రధాన హామీలు ఇచ్చారు. స్కూల్ మరియు కాలేజ్ విద్యార్థులకు ఢిల్లీ బస్సుల్లో ఫ్రీ ట్రావెల్ సదుపాయం అందిస్తామని ప్రకటించారు. మెట్రో ప్రయాణ ఛార్జీలపై విద్యార్థులకు 50% రాయితీ ఇస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల ప్రయోజన పథకాల అమలుకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు వ్యయాన్ని సమానంగా భరించాల్సిందిగా కేజ్రీవాల్ ప్రధానమంత్రి మోడీకి లేఖ రాయనున్నట్లు వెల్లడించారు.
మరోవైపు బీజేపీ & కాంగ్రెస్ హామీల వర్షం
అటు బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు కూడా ఢిల్లీ ఓటర్లకు వరాల వర్షం కురిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రతిపాదించిన జీవన్ రక్ష యోజన ద్వారా ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని హామీ ఇచ్చింది.