బీఆర్ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా రైతు సంక్షేమంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గత 10 సంవత్సరాల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ వ్యవసాయ రంగం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, నేటి కాంగ్రెస్ సర్కార్ కూడా ఈ పథకాలను కొనసాగించాలని సూచించారు.
“దండగ అన్న వ్యవసాయాన్ని పండగగా మార్చాం”
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాల ద్వారా వ్యవసాయం పండుగ శోభ సంతరించుకుందని కేసీఆర్ గుర్తు చేశారు. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో రైతు కుటుంబాలకు భరోసా అందిస్తూ పథకాలు అమలు చేశామన్నారు. నాణ్యమైన విద్యుత్తు సరఫరాతో సాగును సులభం చేశామని వింరించారు. కాల్వలు, ప్రాజెక్టుల ద్వారా సాగుకు అవసరమైన నీటి వనరులను మెరుగుపరిచామన్నారు. కులవృత్తులకు ప్రోత్సాహంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దృఢపరిచామన్నారు.
కేసీఆర్ ఈ సందర్భంగా, వ్యవసాయం పండుగగా మారాలంటే రైతు సంక్షేమం విషయంలో రాజీపడకుండా ముందుకు సాగాలని ప్రభుత్వానికి సూచించారు. “సంక్రాంతి పండుగ తెలుగు రైతు జీవితాల్లో వెలుగులు నింపాలి, అదే మా ధ్యేయం” అని ఆయన పేర్కొన్నారు.