తెలంగాణలో రేపు జరిగే అసెంబ్లీ ప్రత్యేక సెషన్‌పై ఓ ఆసక్తి ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సేవలను గుర్తు చేసుకునేందుకు ఈ సమావేశం జరగబోతుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ వర్గాల్లో ఓ చర్చ నడుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ ఈ సభలో పాల్గొంటారా లేదా? అనేది అందరిలోనూ ఉన్న ప్రశ్న.
మన్మోహన్ సింగ్‌తో తనకున్న వ్యక్తిగత సంబంధాలను కేసీఆర్ శాసనసభలో గుర్తు చేసుకుంటారా? లేక, తన సాంప్రదాయాన్ని కొనసాగింపుగా గైర్హాజరవుతారా..? అని చర్చించుకుంటున్నారు.
మునుపటి అనుబంధం
తెలుగు రాష్ట్రాల్లో మన్మోహన్ సింగ్‌తో అత్యంత సానిహిత్యం ఉన్న రాజకీయ నాయకుడిగా కేసీఆర్ పేరు పొందాడు. ఆయన కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో కొన్ని ముఖ్యమైన అంశాలపై మన్మోహన్ సింగ్‌తో పలు సార్లు సమావేశాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కూడా మన్మోహన్ సింగ్‌తో వివిధ సందర్భాల్లో సమావేశమైన కేసీఆర్, “రావు సాబ్” అని ఆప్యాయంగా పిలువబడేవారు. మన్మోహన్ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
ప్రస్తుతం, కేసీఆర్ అసెంబ్లీ సమావేశానికి హాజరుకావడం గురించి చర్చ జరుగుతున్నది. ఆయన ఈ సభలో పాల్గొన్నట్లయితే, వ్యక్తిగత అనుబంధం గుర్తు చేసుకోవడం సరైన సందర్భంగా భావిస్తున్నారు. అయితే, మరొక వాదన ప్రకారం, కేసీఆర్ సభకు హాజరుకాకపోతే, ఆయనపై విమర్శలు తీవ్రమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.








