తెలంగాణ రాష్ట్ర సమితి (BRS) విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజల సమస్యలను పట్టించుకోవడంలో నిర్లక్ష్యపూరితంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల కోసం నిజమైన పోరాటం చేయగలిగేది BRS మాత్రమేనని, ప్రజల కష్టాలు, అవసరాలు తమకు మాత్రమే తెలుసు అని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందన్నారు. అందుకే, వందశాతం మళ్లీ అధికారంలోకి వచ్చి ప్రజల కోసం పనిచేస్తాం అని కేసీఆర్ ధీమాగా ప్రకటించారు.
ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. పార్టీ సిల్వర్‌జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. బీఆర్ఎస్ అనుబంధ కమిటీ వేయాలని కేసీఆర్ నిర్ణయించారు. కమిటీలకు ఇన్‌చార్జ్‌గా సీనియర్ నేత హరీశ్‌రావుకు బాధ్యతలు అప్పగించారు. ఏప్రిల్ 10వ తేదీ నుంచి బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు కొనసాగుతుందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సత్తా చాటాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.