బీఆర్ఎస్ (BRS) పార్టీ కార్యకర్తలపై దాడులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గంలో ఆమె పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ అనుచరులు దాడి చేయడాన్ని ఆమె తీవ్రంగా విమర్శించారు. “మా పార్టీ కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదు” అని కవిత అధికార పార్టీ శ్రేణులను హెచ్చరించారు.
కార్యకర్తలపై దాడి.. పరామర్శించిన కవిత
అర్ధరాత్రి సమయంలో కొల్లాపూర్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గుజ్జల పరమేశ్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఇవాళ ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. పరమేశ్‌ను కవిత స్వయంగా పరామర్శించి పోలీసుల తీరును తప్పుబట్టారు. దాడి సమయంలో పోలీసులు చూస్తూ ఊరుకున్నారు అని ఆరోపించారు.
భద్రత కట్టుదిట్టం..
సింగోటం శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవడానికి కవిత కొల్లాపూర్ పర్యటనకు వెళ్తున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లను పార్టీ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య మళ్లీ ఘర్షణలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.