తెలంగాణ (Telangana) రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత(Kavitha) మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. శాసనమండలి (Legislative Council)లో తనకు ఇదే చివరి ప్రసంగం అంటూ కన్నీరు పెట్టిన కవిత.. బీఆర్ఎస్ పార్టీ (BRS Party నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అనంతరం గన్‌పార్క్ (Gun Park) వద్ద మీడియాతో మాట్లాడిన ఆమె.. తెలంగాణ తన ద్వారా కొత్త రాజకీయ పార్టీ రాబోతుందనే సంకేతాలిచ్చారు. కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
యువత, మహిళలు, నిరుద్యోగులు, అణగారిన వర్గాల కోసం కొత్త రాజకీయ వేదిక రాబోతున్నట్లు కవిత స్పష్టం చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడటం కోసం ఒక ఆడబిడ్డగా తాను ముందడుగు వేస్తున్నానని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “యువత కోసం, మహిళల హక్కుల కోసం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మీకోసం పనిచేసే కొత్త రాజకీయ వేదిక త్వరలో రాబోతోంది. దీవించండి, ఆశీర్వదించండి, నాతో పాటు నడవండి. కచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తాను” అని అన్నారు.
తెలంగాణ జాగృతి రాజకీయ శక్తిగా..
రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తిగా తెలంగాణ జాగృతి ఎదుగుతుందని కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్ Congress), బీఆర్‌ఎస్ పార్టీలు మహిళలను, యువతను ఘోరంగా మోసం చేశాయని విమర్శించారు. అందుకే తెలంగాణను మనసులో నింపుకున్న ప్రజల కోసం, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే రాజకీయ పార్టీ అవసరం ఉందని తెలిపారు. 2029 ఎన్నికల్లో తెలంగాణ ప్రజల తరఫున తప్పకుండా పోటీ చేస్తామని, తెలంగాణ జాగృతి ఒక శక్తిగా చట్టసభల్లో అడుగుపెడుతుందని ప్రకటించారు.
మైనార్టీలు, యువతకు పిలుపు
మైనార్టీలు, సెక్యులర్లు, యువత, విద్యార్థులు, నిరుద్యోగులతో పాటు లెఫ్ట్ పార్టీ సోదరులు, మావోయిస్టు సానుభూతిపరులకు కూడా కవిత ఆహ్వానం పలికారు. “ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసే కొత్త రాజకీయ శక్తులు రావాలని కోరుకునేవారంతా ముందుకు రావాలి. విద్యార్థులు, యువత తెలంగాణ జాగృతిలో చేరి పిడికిలి బిగించి పోరాటం చేయాలి” అని పిలుపునిచ్చారు. మహిళల హక్కులు, ఆడబిడ్డల గౌరవం కోసం తాను ముందడుగు వేస్తున్నానని కవిత పేర్కొన్నారు. మహిళలంతా తనకు మద్దతు ఇవ్వాలని, తెలంగాణ సెక్యులర్ పార్టీకి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
శాసనమండలిలో చివరి ప్రసంగం
ఇదే తన శాసనమండలిలో చివరి ప్రసంగమని చెప్పిన కవిత భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీటి పర్యంతమవుతూ మాట్లాడిన ఆమె, ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీపై అనేక ఆరోపణలు చేశారు. తన రాజకీయ ప్రయాణం కొత్త దశకు చేరుకుంటోందని, ప్రజల పక్షాన పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు బీజం పడినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.








