కవితక్క‌ కొత్త పార్టీ..? తెలంగాణ‌లో ఉత్కంఠ‌

కవితక్క‌ కొత్త పార్టీ..? తెలంగాణ‌లో ఉత్కంఠ‌

కొంతకాలంగా పార్టీ ముఖ్య నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, కొత్త పార్టీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. నమ్మదగిన వర్గాల సమాచారం ప్రకారం, బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఆమె తన తదుపరి ప్రణాళికలపై దృష్టి సారించారు. ఇప్పటివరకు బీఆర్‌ఎస్‌లో సంస్థాగత అంశాలు, ముఖ్య నాయకులపై విమర్శలు చేసిన కవిత, ఇకపై బహుముఖ వ్యూహాన్ని అనుసరించే యోచనలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె బీజేపీ లేదా కాంగ్రెస్‌తో సహా ఏ ఇతర పార్టీలోనూ చేరకూడదని నిర్ణయించుకున్నారు.

తాను అధ్యక్షురాలిగా ఉన్న ‘తెలంగాణ జాగృతి’ సంస్థను ఒక రాజకీయ పార్టీగా మార్చడం ద్వారా ఆమె తన భవిష్యత్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వం అనే ఎజెండాతో ఈ కొత్త పార్టీ ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేసిన వ్యక్తులు, సంస్థలతో పాటు కలిసి వచ్చే వారందరినీ కలుపుకుని ముందుకు సాగాలని కవిత ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించనున్న మీడియా సమావేశంలో ఈ మేరకు ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా, తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించినప్పుడు తన తండ్రి కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విధంగానే, కవిత కూడా బీఆర్ఎస్ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ పదవిని వదులుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై ఆమె తన సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.

ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కవిత ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని మొదలుపెట్టాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా అన్ని జిల్లాల్లో బతుకమ్మ వేడుకలను నిర్వహించడంతో పాటు, 20కి పైగా దేశాల్లో ఈ సంబరాలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు, సమావేశాలు నిర్వహించే అవకాశం కూడా ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment