భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (Kalvakuntla Taraka Rama Rao) (కేటీఆర్) పుట్టినరోజు నేడు (జులై 24). ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పార్టీ నాయకులతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తాజాగా, ఆయన సోదరి, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సోషల్ మీడియా వేదికగా కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు (Birthday Greetings) తెలిపారు. “అన్నయ్యా.. ఇలాంటి పుట్టినరోజులు నువ్వు మరెన్నో చేసుకోవాలి” అని ఆమె పోస్ట్ చేశారు. అన్నాచెల్లెలి మధ్య విభేదాలున్నాయని గత కొంతకాలంగా విమర్శలు వస్తుండగా, ఈ ఒక్క ట్వీట్‌తో వారిద్దరి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని కవిత క్లారిటీ ఇచ్చారంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు.
గత కొంతకాలంగా కవితకు, కేటీఆర్‌కు మధ్య దూరం పెరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రాసిన లేఖలో “కేవలం ట్వీట్లు చేయడంతోనే ఆగిపోకూడదు” అంటూ కవిత, కేటీఆర్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. అదే సమయంలో, పార్టీ విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిదని కేటీఆర్ కవితకు పరోక్షంగా చురకలంటించారు. ఈ నేపథ్యంలో, సోదరుడి పుట్టినరోజు సందర్భంగా కవిత చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పినట్లు సీఎంవో అధికారిక ఖాతా ద్వారా తెలియజేసింది.








