కరీంనగర్ జిల్లాలో పర్యటించిన బీఆర్‌ఎస్ నాయకురాలు కవిత, మక్తపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, మొంథా తుపాను మరియు ఆలస్యమైన కొనుగోళ్ల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడిగా ధాన్యం నిల్వ ఉండగా, వర్షాల వల్ల మొలకెత్తడం, బూజు పట్టడం, తడవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని తెలిపారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి, ఎకరాకు కేవలం రూ. 10 వేలు పరిహారం ఇస్తే సరిపోదని, రైతులకు న్యాయం జరగాలంటే ఎకరాకు రూ. 50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని ఆమె ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు.
కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఆలస్యంగా ప్రారంభమయ్యాయని కలెక్టర్‌ను ప్రశ్నించిన కవిత, వెంటనే తేమ శాతం ఎక్కువ ఉన్నా, మొలకెత్తినా సరే ధాన్యాన్ని కొనుగోలు చేసేలా మిల్లర్లకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూమి దస్తావేజులు లేవనే సాకుతో కౌలు రైతుల ధాన్యాన్ని కొనకపోవడం అన్యాయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే ఫీల్డ్‌లోకి వచ్చి పంట నష్టం అంచనా వేయాలని, రైతులు కూలీల కోసం అదనంగా చెల్లిస్తున్న ఖర్చులను, ప్రకటించిన బోనస్‌ను కూడా అందించాలని ఆమె డిమాండ్ చేశారు.





 



