ఫ్రెండ్స్‌ మ‌ధ్య సిగరెట్ లైటర్ గొడవ.. కారుతో ఢీకొట్టి హ‌త్య‌

ఫ్రెండ్స్‌ మ‌ధ్య సిగరెట్ లైటర్ గొడవ.. కారుతో ఢీకొట్టి హ‌త్య‌

సిగ‌రెట్ లైట‌ర్ (Cigarette Lighter) విష‌యంలో ఇద్ద‌రు స్నేహితుల (Two Friends) మ‌ధ్య త‌లెత్తిన వివాదం ఒక‌రి ప్రాణాలు తీసింది. కర్ణాటకలోని కమ్మసంద్ర గ్రామంలో జరిగిన దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సిగరెట్ లైటర్‌తో మొదలైన చిన్న గొడవ చివరకు విషాదంగా ముగిసింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కారులో ఉన్న డ్యాష్‌బోర్డ్ కెమెరాలో రికార్డవడం గమనార్హం.

కమ్మసంద్రలో జరిగిన క్రికెట్ పోటీలకు హాజరైన స్నేహితులు ప్రశాంత్‌ (Prashanth) (35), రోషన్ హెగ్డే (Roshan Hegde) మ్యాచ్ ముగిసిన అనంతరం కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో సిగరెట్ లైటర్ విషయమై ఇద్దరి మధ్య మాటల తగాదా మొదలైంది. గొడవ ముదరడంతో ఇద్దరూ బీర్ బాటిళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో రోషన్ హెగ్డే నాలుకకు తీవ్ర గాయమైంది.

గాయాల నేపథ్యంలో అక్కడి నుంచి తప్పించుకునేందుకు రోషన్ తన కారులో వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. అయితే అతడిని అడ్డుకునేందుకు ప్రశాంత్ కారు డోర్ పట్టుకున్నాడు. ఈ సమయంలో రోషన్ కారు వేగంగా నడిపి ప్రశాంత్‌ను ఈడ్చుకెళ్లి చెట్టుకు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ప్రశాంత్ తీవ్రంగా గాయపడి, ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు.

ఇక నాలుక తెగిపోవడంతో పాటు ఇతర గాయాల కారణంగా రోషన్ హెగ్డే ప్రస్తుతం పోలీసుల అదుపులో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు డ్యాష్‌బోర్డ్ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ సంఘటన స్నేహాల మధ్య చిన్న గొడవలు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో మరోసారి రుజువు చేస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment