డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ భవిష్యత్తుపై కాపు నేత దాసరి రాము ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఉద్దేశిస్తూ గతంలో జరిగిన సంఘటనలను ఆయన గుర్తుచేసుకున్నారు. ఎన్నికల సమయంలో టీడీపీతో పొత్తు వద్దని పవన్ కళ్యాణ్‌కు అనేక సార్లు బీజేపీ అధిష్టానం చెప్పిందని, అయినా పవన్ వినిపించుకోలేదన్నారు. ఒక సంవత్సరం ముఖ్యమంత్రి పదవి అయినా అడుగుదాం అని బీజేపీ చెప్పినా పవన్ వినలేదని గుర్తుచేశారు. జనసేనను ఒక రాజకీయ శక్తిగా తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ ఎదగనివ్వదని సంచలన ఆరోపణ చేశారు కాపు నేత దాసరి రాము.
లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి డిమాండ్‌తో కూటమి నేతల మధ్య అంతర్గత విభేదాలు మొదలయ్యాయి. లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేస్తే పవన్‌ను సీఎం చూడాలని మాకూ ఉంటుందంటూ తిరుపతిలో జనసేన నేత కిరణ్ రాయల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇదిలా కొనసాగుతుండగా, జనసేన భవిష్యత్తుపై ప్రస్తుతం కాపు నేత దాసరి రాము చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.