ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని కాన్పూర్ (Kanpur)లో భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. న్యాయ విద్యార్థి అయిన 22 ఏళ్ల అభిజీత్ సింగ్ (Abhijeet Singh) చందేల్ (Chandel)పై మెడికల్ షాపు నిర్వాహకులు, మరో ఇద్దరు కలిసి మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దాడిలో విద్యార్థి కడుపుపై పదునైన ఆయుధంతో కోయడమే కాక, చేతి వేళ్లను నరికివేశారు.
కాన్పూర్ విశ్వవిద్యాలయంలో లా మొదటి సంవత్సరం చదువుతున్న అభిజీత్, మందుల విషయంలో మెడికల్ షాపు అటెండెంట్ అమర్ సింగ్‌తో వాగ్వాదానికి దిగాడు. అది ఘర్షణగా మారి, అమర్ సింగ్, అతని సోదరుడు విజయ్ సింగ్‌తో పాటు మరో ఇద్దరు నిందితులు (ప్రిన్స్ రాజ్ శ్రీవాస్తవ, నిఖల్) కలిసి అభిజీత్‌పై దాడి చేశారు. తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన అభిజీత్‌ను స్థానికులు అప్రమత్తమై ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని, కడుపుపై 14 కుట్లు పడ్డాయని పోలీసులు తెలిపారు.
నిందితుల అరెస్టు: ఈ కేసులో ముగ్గురు నిందితులను హత్యాయత్నం ఆరోపణలపై అరెస్టు చేసినట్లు ఏసీపీ కుమార్ తెలిపారు. నాల్గవ నిందితుడు పరారీలో ఉన్నాడు. అయితే, బాధితుడి తల్లి నీలం సింగ్ చందేల్ మాట్లాడుతూ, నిందితులు పోలీసులతో కుమ్మక్కై, తమ కుమారుడిపై తప్పుడు దోపిడీ కేసు నమోదు చేయించారని ఆరోపించారు. దీనిపై నిజం తెలుసుకున్న తర్వాత కొత్త కేసు నమోదు చేసినట్లు ఏసీపీ కుమార్ వెల్లడించారు.





 



