విజయవాడ (Vijayawada)లోని ప్రసిద్ధ కనకదుర్గమ్మ ఆలయానికి (Kanaka Durga Temple) ఏపీసీపీడీసీఎల్ (APCPDCL) భారీ షాక్ ఇచ్చింది. విద్యుత్ బిల్లుల బకాయిల (Electricity Bill Dues) పేరుతో దుర్గగుడికి విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని కోరిన దేవస్థానం అయినప్పటికీ పవర్ కట్ (Power Cut) చేశారు. 2023 ఫిబ్రవరి నుంచి 3.08 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించలేదని విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు.
బకాయిల వసూలు కోసం పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ దేవస్థానం నుంచి స్పందన రాలేదని ఏపీసీపీడీసీఎల్ తెలిపింది. దీంతో చివరి దశగా హెచ్‌టీ లైన్ (High Tension Line) నుంచి నేరుగా విద్యుత్ సరఫరాను నిలిపివేశామని అధికారులు స్పష్టం చేశారు. ఈ చర్యతో ఆలయ పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యుత్ సరఫరా నిలిపివేతపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా రోజూ వేలాది మంది భక్తులు వచ్చే ఆలయానికి కరెంట్ నిలిపివేయడం అనవసర సమస్యలకు దారితీస్తుందని పేర్కొన్నారు.
అయితే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా జనరేటర్ల సాయంతో ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరాను కొనసాగిస్తున్నట్లు దేవస్థానం తెలిపింది. ఈ ఘటనపై భక్తులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానం–విద్యుత్ శాఖ మధ్య సమన్వయ లోపమే ఈ వివాదానికి కారణమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మూడు గంటల పాటు విద్యుత్ సరఫరాను నిలిపివేసిన ఏపిసిపిడిసిఎల్ అధికారులు భక్తుల అసంతృప్తి వ్యక్తం చేస్తుండడంతో దుర్గగుడికి విద్యుత్ పునఃరుద్దరించారు.








