కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan) తన సామాజిక సేవలను ఎప్పుడూ పెద్దగా చెప్పుకోరు. అయితే, ఆయన సాయం పొందినవారు కొన్ని సందర్భాల్లో బహిరంగంగా చెప్పడంతో అవి వైరల్ అవుతుంటాయి. కమల్ సాంస్కృతిక కేంద్రాల ద్వారా ఇప్పటికే వందల మందికి విద్యాసాయం అందిస్తున్న ఆయన, తాజాగా ఓ పేద విద్యార్థి (Poor Student)ని ఉన్నత విద్య (Higher Education)కు ఆర్థిక సహాయం (Financial Assistance) చేశారు.
తమిళనాడు (Tamil Nadu)లోని రామనాథపురం జిల్లా, పాంబన్ సమీపంలోని తెర్కువాడి మత్స్యకార గ్రామానికి చెందిన శోభన (Shobana) అనే విద్యార్థిని ప్లస్-2 పరీక్షల్లో 562 మార్కులతో ప్రభుత్వ పాఠశాలలో టాపర్‌గా నిలిచింది. ఆమె తండ్రి మత్స్యకారుడు, తల్లి పీతల ఎగుమతి కంపెనీలో కూలీగా పనిచేస్తుంది. సివిల్ సర్వీసెస్ అధికారిగా ఎదగాలని శోభన కలలు కన్నా, కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మానేసి ఓ బట్టల దుకాణంలో పనిలో చేరింది.
ఈ విషయం సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న కమల్ హాసన్, శోభనను తన కార్యాలయానికి ఆహ్వానించి, కమల్ సాంస్కృతిక కేంద్రం ద్వారా ఆమె ఉన్నత విద్యకు అవసరమైన ఖర్చులను భరించారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమయ్యే వరకు అన్ని ఏర్పాట్లు చేస్తానని, గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకు తన సంరక్షణలో చదువు కొనసాగించేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ సాయంతో శోభన కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. కమల్ హాసన్ చేసిన సహాయాన్ని వృథా కానివ్వనని, సివిల్ సర్వీసెస్ సాధించి సమాజ శ్రేయస్సు కోసం కృషి చేస్తానని శోభన గట్టిగా చెప్పింది.