రూ.920 కోట్ల ఈ-స్టాంప్ స్కామ్‌.. టీడీపీ ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు

రూ.920 కోట్ల ఈ-స్టాంప్ స్కామ్‌.. టీడీపీ ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు

అనంతపురం జిల్లా (Anantapur District) కళ్యాణదుర్గం నియోజకవర్గంలో (Kalyandurg Assembly Constituency) ఈ–స్టాంపుల (E-Stamp Papers) ముసుగులో జరిగిన భారీ కుంభకోణంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుమారు రూ.920 కోట్ల విలువైన ఈ-స్టాంప్ స్కాం జ‌రిగిన‌ట్లుగా ఆరోప‌ణ‌లున్న ఈ కేసుకు సంబంధించి కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే (TDP MLA) అమిలినేని సురేంద్రబాబుకు (Amilineni Surendra Babu) నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఎమ్మెల్యేతో పాటు మరొక 12 మందికి హైకోర్టు నోటీసులు పంపింది. ఫిబ్రవరి 18వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇటీవల కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వెలుగులోకి వచ్చిన ఈ కుంభకోణంలో, రూ.100 విలువైన ఈ-స్టాంప్‌ను రూ.లక్ష స్టాంపుగా మార్చి ట్యాంపరింగ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. నకిలీ ఈ-స్టాంప్ పత్రాలను బ్యాంకులకు సమర్పించి, వాటి ఆధారంగా వందల కోట్ల రూపాయల రుణాలు అక్రమంగా తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమ రుణాల వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబు‌కు చెందిన ఎస్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ (SR Constructions) సంస్థ పేరు బయటకు వచ్చింది.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఎర్రప్ప అలియాస్ ‘మీసేవ బాబు’ (Errappa alias “MeeSeva Babu”)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు సన్నిహితుడిగా పనిచేస్తున్న మీసేవ బాబు ఇంట్లో పోలీసులు నిర్వహించిన సోదాల్లో, పెద్ద ఎత్తున నకిలీ ఈ–స్టాంప్ పేపర్లు, రబ్బరు స్టాంపులు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో మీసేవ బాబు సుమారు 13,000 నకిలీ ఈ–స్టాంప్ పత్రాలను ట్యాంపరింగ్ చేసి విక్రయించినట్లు వెల్లడైంది.

ఎస్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థలో ఎమ్మెల్యే సురేంద్రబాబు భాగస్వామిగా ఉన్నారన్న ఆరోపణలు ఉండటంతో పాటు, మీసేవ బాబుతో కలిసి ఉన్న ఫోటోలు గతంలో సోషల్ మీడియాలో వైరల్ కావడం ఈ కేసుకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు జారీ చేసిన నోటీసులు రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment