---Advertisement---

‘కల్కి’పై అనంత్ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు

‘కల్కి’పై అనంత్ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
---Advertisement---

ప్రముఖ సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ తాజాగా ‘హైందవ శంఖారావం’ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సినిమాల్లో హైందవ ధర్మంపై జరుగుతున్న దాడులను ఎత్తి చూపారు. పురాణాలను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. చలనచిత్రం కళాత్మక వ్యాపారంగా మారి హిందూ ధర్మాన్ని కళంకితంగా చేస్తోందని, హైందవ ధర్మ వ్యక్తిత్వ హననానికి చిత్రపరిశ్రమ తరపున తాను క్షమాపణలు కోరుతున్నాన‌న్నారు. తెరపైన కనిపించే పాత్రలు, వినిపించే పాటల్లో హైందవ ధర్మం దుర్వినియోగం అవుతుంద‌న్నారు. తెరవెనుక త‌మ‌ ముందు అన్యమతస్తుల ప్రవర్తన, వాల్మీకి రామాయణం, వ్యాసభారతాన్ని వినోదం కోసం వక్రీకరిస్తున్నారన్నారు.

ఇదే క్రమంలో ‘కల్కి 2898AD’ సినిమాపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. “ఈ సినిమాలో కర్ణుడి పాత్రను చాలా ఎక్కువగా హైలైట్ చేశారు. కానీ కర్ణుడు శూరుడు అనే దాన్ని హిందువులందరూ ఒప్పుకుంటారా? ఇటువంటి వక్రీకరణలు చూస్తూ సిగ్గుపడుతున్నాను. తప్పును తప్పుగా చెప్పాలి” అని ఆయన అన్నారు. కర్ణుడి పాత్రకు అనవసర గొప్పతనం ఇచ్చినందుకు సినిమా పరిశ్రమ వ్యక్తిగా సిగ్గుపడుతున్నాన‌న్నారు. కల్కి సినిమాలో అగ్ని దేవుడిచ్చిన ధనుస్సు పట్టిన అర్జునుడి కంటే.. సూర్యదేవుడిచ్చిన ధనుస్సుపట్టిన కర్ణుడు వీరుడని చెప్పారని, అభూతకల్పనలు, వక్రీకరణలు జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటే ఎన్ని సినిమాలైనా వస్తాయన్నారు.

చిత్రీకరణ, గీతాలాపనలో ఎన్నో రకాలుగా హైంద‌వ ధ‌ర్మం వక్రీకరణ జరుగుతోందన్నారు. హైందవ ధర్మాన్ని అవహేళన చేస్తుంటే మనం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటే ఎలా..? అని ప్ర‌శ్నించారు. మ‌న హైందవ ధర్మాన్ని అవమానిస్తే నిగ్గదీసి నిలదీద్దామ‌ని పిలుపునిచ్చారు. ఒక సినిమా పాట రాసేందుకు ఒక సంగీత దర్శకుడి దగ్గరకు వెళ్లాన‌ని, ఆపాటలో బ్రహ్మాండనాయకుడు అనే హిందూ పదం ఉందని ఆ పాట చేయనన్నాడన్నారు. ఆ పాట చేయనన్నందుకు జీవితాంతం ఆ సంగీత దర్శకుడికి పాటలు రాయనని చెప్పానని, 15 ఏళ్లుగా ఆ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కోసం ఒక్క పాట కూడా రాయలేదన్నారు.

అనంత్ శ్రీరామ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్ర‌స్తుతం వైరల్‌గా మారాయి. ఈ విషయంపై ప్రజల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాల్లో రొమాంటిక్ సాంగ్స్ రాస్తున్న‌ప్పుడు హైంద‌వ ధ‌ర్మం గురించి గుర్తుకురాదా..? అని ప‌లువురు శ్రీ‌రామ్‌ను ప్ర‌శ్నిస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment