కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)లో అవినీతి (Corruption) జరిగినదని ఆరోపణల నేపథ్యంలో ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission)విచారణ (Inquiry) నేటి (జూన్ 6) నుంచి ప్రారంభం కానుంది. ఉదయం 11:30 గంటలకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Etela Rajender) కమిషన్ ముందు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ (Justice Pinaki Chandra Ghose) ఈటెలను ప్రశ్నించనున్నారు.
ఈటల గతంలో నిర్వహించిన బాధ్యతల ఆధారంగా కమిషన్ ప్రత్యేక ప్రశ్నావళిని సిద్ధం చేసింది. మొదటి గంటలో ఈటలకు తన వాదనలు వివరించే అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. అనంతరం ఆర్థికపరమైన అంశాలపై ప్రశ్నలు వేయనున్నారు. ఈనెల 11వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (K.Chandrashekar Rao) కూడా కమిషన్ విచారణకు హాజరుకానున్నారు. ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి హరీష్ రావు (T. Harish Rao), ఆర్థిక శాఖకు చెందిన కీలక నేతలు కూడా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విచారణ తుదిదశకు చేరుకుంది. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ కీలక మలుపులో అడుగుపెట్టింది. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అనేక సంశయాస్పద లావాదేవీలపై కమిషన్ స్పష్టత తెచ్చేందుకు సాక్ష్యాలు సమీకరిస్తోంది. ఈ విచారణ ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగా తీవ్ర దుమారం రేగే అవకాశముంది. ప్రధాన నాయకులపై ఆరోపణలు నిరూపితమైతే అది పెద్ద సంచలనంగా మారే అవకాశముంది.








