ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో అధికార టీడీపీ(TDP) కూటమి నాయకులు అసాంఘిక, అనైతిక కార్యకలాపాల్లో మునిగితేలుతున్నారని, వారికి పోలీసులు వంత పాడుతున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరును ఎండగట్టారు.
రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా వదిలేస్తారా?
నెల్లూరులోని(Nellore) ఒక లాడ్జిపై పోలీసులు జరిపిన దాడిలో టీడీపీ నాయకుడు, చౌటపాళెం సొసైటీ అధ్యక్షుడు రాధాకృష్ణమనాయుడు (Radhakrishna Naidu) వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారని కాకాణి ఆరోపించారు. ఏఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో 17 మంది విటులతో పాటు రాధాకృష్ణమనాయుడు కూడా పట్టుబడ్డారని, స్టేషన్‌లో ఆయన కౌన్సెలింగ్‌లో కూర్చున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని గుర్తు చేశారు. తప్పు చేసి తలదించుకుని కూర్చున్న వ్యక్తిని.. కేవలం అధికార పార్టీ నేత కావడంతోనే ఆసుపత్రి పని మీద వచ్చాడంటూ పోలీసులు వదిలేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. దీనిపై దమ్ముంటే పోలీసులు రైడింగ్ వీడియోలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
టీడీపీలో రోజుకో ‘రత్నం’ బయటపడుతోంది!
టీడీపీ (TDP) ఎమ్మెల్యేలు, కీలక నేతల వరుస లైంగిక వేధింపుల (Sexual Harassment) ఉదంతాలను కాకాణి ఏకరువు పెట్టారు. నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య (Jayasurya) ఒక లాడ్జిలో దొరికిపోతే, లైట్లు ఆపేసి మరీ పోలీసులు ఆయనను తప్పించారని ఆరోపించారు. టీటీడీ ఛైర్మన్ బిఆర్ నాయుడు (B.R Naidu) రాసలీలల వీడియోలు బయటకు వచ్చినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని, బాధితురాలు గతంలోనే చంద్రబాబుకు(Chandrababu) లేఖ రాసినా పట్టించుకోకుండా పవిత్రమైన టీటీడీ పదవిని కట్టబెట్టారని విమర్శించారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, గుంటూరు ఎమ్మెల్యే నసీర్, ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వంటి వారు మహిళల పట్ల ప్రవర్తించిన తీరుపై కాకాణి నిప్పులు చెరిగారు.
పోలీసులకు హెచ్చరిక
తప్పు చేసిన అధికార పార్టీ నేతలను కాపాడుతూ, బాధితులను వేధిస్తున్న పోలీసులు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కాకాణి హెచ్చరించారు. “నిందితులను తప్పించడమే పోలీసుల పనిగా మారిందా?” అని ఆయన ప్రశ్నించారు. చట్టం ముందు అందరూ సమానమని నిరూపించాలంటే తక్షణమే ఈ కేసులపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.








