జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే రాజయ్య మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల కడియం శ్రీహరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి దారితీశాయి. కడియం వ్యాఖ్యలకు దీటుగా కౌంటర్ ఇచ్చారు రాజయ్య.
రాజయ్య మాట్లాడుతూ… “నీకు ఎమ్మెల్యే పదవి నీ అయ్యా అవ్వ ఎవరైనా రాసి ఇచ్చారా?” అంటూ శ్రీహరిపై విమర్శలు గుప్పించారు. “నువ్వు, నీ బిడ్డ పార్టీ ఫండ్ తీసుకుని అమ్ముడుపోయారు, నిన్ను తిట్టే హక్కు బరాబర్‌గా BRS పార్టీకే ఉంది” అని రాజయ్య వ్యాఖ్యానించారు. “మగాడివైతే… నీకు నిజంగా మగతనం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి రా” అని ఆయన సవాల్ విసిరారు.
కడియం శ్రీహరికి దమ్ముంటే రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేయాలని రాజయ్య సూచించారు. “ఘనపూర్ గడ్డపై నువ్వో నేనో తేల్చుకుందాం..” అంటూ ఆయన ఛాలెంజ్ చేశారు. జూబ్లీహిల్స్ విజయం గురించి కాంగ్రెస్ నేతలు విర్రవీగుతున్నారని, అయితే స్టేషన్ ఘనపూర్ ఉపఎన్నికల్లో తనను ఎదుర్కోవాలని రాజయ్య డిమాండ్ చేశారు.
“ఉపఎన్నికల్లో నువ్వు గెలిస్తే ఇకపై నీ పేరు నేను పలకను” అంటూ రాజయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తన హక్కు అని, ప్రజల కోసం బీఆర్ఎస్ తరఫున తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. స్టేషన్ ఘనపూర్ రాజకీయాల్లో ఈ మాటల యుద్ధం మరింత ముదురుతుందని, రానున్న రోజుల్లో ఈ వివాదం ఇంకా పెరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.








