ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై దాడులు విపరీతమవుతున్నాయి. ఓ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆడవారి జోలికి వస్తే అదే ఆఖరి రోజని వార్నింగ్‌లు ఇస్తున్నా.. ఆ దిశగా ఎలాంటి కఠిన చర్యలేవీ లేకపోవడంతో అతివల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. ఆడవారిపై అత్యాచారం, హత్య వంటి ఘటనలు రోజుకు ఒకటి బయటకొస్తూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో శ్రీసత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలోని నాగిరెడ్డిపల్లెలో దారుణం చోటుచేసుకుంది. గ్రామంలో మతిస్థిమితం లేని మహిళపై ఆటో డ్రైవర్ ముబారక్ వేట కొడవలితో దాడి చేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. నాగిరెడ్డిపల్లెలోని మతిస్థిమితం లేని మహిళ తనకు లొంగక పోవడంతో వేట కొడవలితో ఆటోడ్రైవర్ ముబారక్ హల్‌చల్ సృష్టించాడు. ఆ మహిళ ఎంతగా వారించిన వినకుండా మద్యం మైకంలో వేట కొడవలి పట్టుకొని ఆమెపై పలుమార్లు దాడికి యత్నించాడు. అతని నుంచి తప్పించుకునేందుకు మహిళ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ వినకుండా తన చేతిలోని పదునైన వేట కొడవలితో ఆమె తలపై దాడి చేసి గాయపరిచాడు. ఆటో డ్రైవర్ ముబారక్ వేట కొడవలితో హల్ చల్ చేయడంతో నాగిరెడ్డిపల్లి వాసులు భయభ్రాంతుకు గురయ్యారు.
దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాష్ట్రంలో మతిస్థిమితం లేని మహిళకే రక్షణ లేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సేఫ్ హ్యాండ్స్‌లో ఉండడం అంటే ఇదేనా..? అని ప్రశ్నిస్తున్నారు. ఆడబిడ్డల జోలికి ఎవరైనా వస్తే అదే మీకు చివరి రోజు.. తాట తీస్తా.. అని సీఎం చంద్రబాబు పలుమార్లు హెచ్చరించినా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఆడవారిపై అఘాయిత్యాలు అరికట్టలేకపోతున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.








