అర్ధరాత్రి కడప నగరంలో చోటుచేసుకున్న దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కడప నగరంలోని ఎర్రముక్కపల్లి ప్రాంతంలో టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవీరెడ్డి అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. వందేళ్లుగా నివాసం ఉంటున్న దళిత కుటుంబానికి చెందిన ఇంటిని రెండు జేసీబీలతో రాత్రికి రాత్రే పూర్తిగా నేలమట్టం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని రోడ్డు మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. కడప నగరంలోని ఎర్రముక్కపల్లిలో భాస్కర్, లక్ష్మీ చలపతి, భారవి కుటుంబానికి చెందిన ఇంటిపై అర్ధరాత్రి దాడి జరిగింది. ఇంట్లో ఉన్న మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులను బలవంతంగా బయటకు లాగి పడేసి, వెంటనే జేసీబీలతో ఇల్లు కూల్చివేసినట్లు బాధితులు వాపోతున్నారు. ముసలివారిని, చిన్నారులను కూడా కనికరం లేకుండా బయటకు తోసేసిన జేసీబీలతో ఇంటిని కూల్చేశారు.
ఈ ఘటన వెనుక టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు శ్యామ్ సుందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ద్వారకనాథ రెడ్డి ఉన్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. వీరంతా కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి బంధువులమని చెప్పుకుని దౌర్జన్యానికి పాల్పడ్డారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. రాత్రికి రాత్రే దాదాపు వంద మంది మద్యం మత్తులో వచ్చి ఇల్లు కూల్చేశారని వాపోయారు.
“మేము దళితులం కాబట్టే మా ఇంటిని లాక్కోవాలనే ఉద్దేశంతో ఈ దారుణానికి పాల్పడ్డారు. మా మెడలో ఉన్న మంగళసూత్రాలు కూడా లాక్కెళ్లే పరిస్థితి వచ్చింది” అంటూ బాధిత మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. తమకు న్యాయం జరిగే వరకు రోడ్డుపై నిరాహార దీక్ష చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే బాధిత కుటుంబం మాత్రం న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
“పవన్ కళ్యాణ్ అన్నా.. ఒకసారి మాతో మాట్లాడండి. మాకు న్యాయం చేయండి” అంటూ బాధితులు రోడ్డుపై బైఠాయించి వేడుకుంటున్నారు. రాజకీయ బలం ఉందన్న అహంకారంతోనే తమపై ఈ దాడి జరిగిందని, ఎమ్మెల్యే బంధువుల ప్రమేయంపై నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. దళితుల భద్రతపై, చట్టపాలనపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి.








