పర్యావరణ హితం కోసం ఎలక్ట్రికల్ వెహికల్స్ దోహదపడతాయని చెబుతున్నానప్పటికీ.. వాటి వలన జరిగే అనర్థాలు కూడా అదే స్థాయిలో ఉన్నారు. తాజాగా కడప జిల్లాలో జరిగిన ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. యర్రగుంట్ల మండలంలోని పొట్లదుర్తి గ్రామంలో శుక్రవారం ఎలక్ట్రిక్ బైక్ పేలి వృద్ధురాలు మృతిచెందిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
62 ఏళ్ల వెంకట లక్ష్మమ్మ అనే మహిళ తన ఇంటి వరండాలో ఎలక్ట్రిక్ బైక్‌ను ఛార్జింగ్‌కు పెట్టి, సమీపంలోని సోఫాపై నిద్రిస్తుండగా, బైక్ బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ పేలుడు కారణంగా ఆమె శరీరం తీవ్రంగా కాలిపోవడంతో అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనతో పొట్లదుర్తి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, విచారణను ప్రారంభించారు.
అయితే ఛార్జింగ్ సమయంలో బ్యాటరీ లేదా ప్లగ్ పాయింట్‌లో సాంకేతిక లోపం ఈ పేలుడుకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల నాణ్యత, ఛార్జింగ్ సిస్టమ్‌ల భద్రతపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. స్థానికులు ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులు ఛార్జింగ్ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.








