హైదరాబాద్ (Hyderabad) వేదికగా తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ (Global Summit)పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఏ.పాల్ (K.A. Paul) తీవ్ర విమర్శలు గుప్పించారు. గత రెండు రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిర్వహించిన సమ్మిట్ అసలు గ్లోబల్ సమ్మిట్ కాదని, అది పూర్తిగా “లోకల్ ఈవెంట్” (Local Event)గానే మారిపోయిందని వ్యాఖ్యానించారు. సల్మాన్ ఖాన్ (Salman Khan) కు 5,000 ఎకరాలు ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసి సమ్మిట్‌కు రప్పించుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
గ్లోబల్ సమ్మిట్‌పై సీఎం రేవంత్ రెడ్డి భారీ ఎత్తున ప్రచారం చేసినప్పటికీ 200 దేశాల నుంచి ఒక్క ప్రధాని గాని, ఒక్క మంత్రి గాని సమ్మిట్‌కు హాజరు కాలేదని అన్నారు. MOUల విషయంలో కూడా ఎలాంటి ప్రముఖ సంస్థలు లేదా వ్యాపారవేత్తలు సంతకం చేయలేదని దుయ్యబట్టారు. “అన్ని అబద్ధాలే… ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన పీఆర్ షో (PR show) మాత్రమే ఇది” అని వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం సుమారు రూ.300 కోట్లు ఖర్చు పెట్టిందని, అయితే సమ్మిట్ ద్వారా వచ్చిన లాభాలు మాత్రం ఏమీ లేవని కె.ఏ.పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత పెద్ద మొత్తాన్ని ప్రజాధనం నుంచి ఖర్చు పెట్టి కూడా రాష్ట్రానికి కనీస ప్రయోజనం కనబడలేదని ఆయన విమర్శించారు.
రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి
ఇక దేశవ్యాప్తంగా 7,600 విమానాలు రద్దు అయినా ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) రాజీనామా చెయ్యకుండా ఉన్నారని పాల్ వ్యాఖ్యానించారు. ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం జరిగినప్పుడే ఆయన రాజీనామా చేయాల్సిందని అన్నారు. దేశంలో రెండే రెండు ఎయిర్‌లైన్స్ మిగిలిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందో మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. “న్యాయం జరిగే వరకు నేను పోరాటం కొనసాగిస్తాను” అని కె.ఏ.పాల్ హెచ్చరించారు.








