కెనడా రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తన పదవికి, అలాగే లిబరల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ “పార్టీకి, గవర్నర్ జనరల్‌కు నా రాజీనామా నిర్ణయాన్ని తెలియజేశాను. కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్న తర్వాత నేను బాధ్యతల నుంచి వైదొలుగుతాను. ఈ ప్రక్రియను మార్చి 24 వరకు కొనసాగించేందుకు పార్లమెంటును ప్రొరోగ్ చేస్తున్నాను” అని తెలిపారు. కెనడా చట్టం ప్రకారం, అధికార పార్టీ నేత రాజీనామా చేసిన పక్షంలో 90 రోజుల్లో కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవాలి.
ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ రాజీనామా
ఇటీవల, కెనడా ఉప ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తూ, ఆయన ప్రజాదరణ తగ్గిపోతోందని ఆరోపించారు. దాదాపు పదేళ్లపాటు ప్రధానమంత్రిగా కొనసాగిన ట్రూడో తన పదవికి రాజీనామా చేయాలని పార్టీ నేతల నుండి ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.
కొత్త నాయకత్వానికి మార్గం
జస్టిన్ ట్రూడో రాజకీయ అనిశ్చితిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో, కెనడా రాజకీయ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లిబరల్ పార్టీ ఇప్పుడు కొత్త నాయకత్వాన్ని ఎన్నుకునే కీలక దశలో ఉంది.