జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉపఎన్నికల్లో (By-Elections) బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత (Maganti Sunitha) ఎంపిక వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) వారసుడిని తానేనంటూ తారక్ ప్రద్యుమ్న తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి (CEO)కి లేఖ రాశారు.
ఆ లేఖలో తారక్ ప్రద్యుమ్న కీలక విషయాలను ప్రస్తావించారు. తన తల్లి మాలినీ దేవి (Malini Devi)ని హిందూ వివాహ చట్టం ప్రకారం మాగంటి గోపీనాథ్ వివాహం చేసుకున్నారని పేర్కొన్నారు. గోపీనాథ్ భార్య అంటూ మాగంటి సునీత తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారని ఆరోపించారు. కాబట్టి, సునీత సమర్పించిన అఫిడవిట్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు. కాగా, మాగంటి సునీత నామినేషన్‌ను ఈసీ ఇప్పటికే ఆమోదించింది.
మరోవైపు, ఈ ఆరోపణల నేపథ్యంలో మాగంటి సునీత షేక్‌పేట్ ఆర్వో (రిటర్నింగ్ ఆఫీసర్) కార్యాలయానికి వచ్చారు. తన నామినేషన్‌లో పేర్కొన్న అంశాలన్నీ సరైనవేనంటూ అధికారులకు డిక్లరేషన్ ఫారమ్‌ను సమర్పించారు.








