జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల దాఖలు ప్రక్రియ చివరి రోజు కావడంతో రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం వద్ద భారీ హడావుడి నెలకొంది. నామినేషన్ల స్వీకరణకు ఇవాళే తుది గడువు కావడంతో, అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే, ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏమిటంటే.. రాజకీయ పార్టీల నాయకులతో పాటుగా, తమ సమస్యలను ప్రస్తావించాలని కోరుకునే సాధారణ పౌరులు సైతం ఈ పోటీలో నిలవడం.
సాధారణ ప్రజలు ఈ ఎన్నికను తమ నిరసనను వ్యక్తం చేసే వేదికగా మలచుకున్నారు. ముఖ్యంగా నిరుద్యోగులు తమ ఆవేదనను చాటిచెప్పేందుకు నామినేషన్లు వేయగా, ఫార్మాసిటీ, RRR (రీజినల్ రింగ్ రోడ్డు) ప్రాజెక్టుల బాధితులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయడానికి తరలిరావడం సంచలనం సృష్టించింది. తమ భూములు కోల్పోయినా న్యాయం జరగలేదని చెబుతూ, తమ గోడును వెలిబుచ్చేందుకు ఈ ఉపఎన్నిక బరిలోకి దిగారు. దీంతో రిటర్నింగ్ ఆఫీసు వద్ద సందడిగా, ఉద్రిక్తతతో కూడిన వాతావరణం నెలకొంది.
నామినేషన్ల దాఖలు ప్రక్రియ మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగనుంది. నిన్నటి వరకు మొత్తం 94 మంది అభ్యర్థులు 127 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బీఆర్‌ఎస్ నుంచి మాగంటి సునీత నామినేషన్లు వేశారు. బీఆర్‌ఎస్ నుంచి పి. విష్ణువర్ధన్ రెడ్డి డమ్మీ నామినేషన్ వేశారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరఫున ఆయన భార్య నామినేషన్ దాఖలు చేయగా, దీపక్ రెడ్డి ఈరోజు మరో సెట్ నామినేషన్ వేయనున్నారు.








