నకిలీ మద్యం (Illicit Liquor) కేసులో జోగి రమేష్ (Jogi Ramesh) సోదరులకు భారీ ఊరట లభించింది. జోగి రమేష్‌తో పాటు ఆయన సోదరుడు జోగి రాము (Jogi Ramu)కు తంబళ్లపల్లి కోర్టు బెయిల్ (Bail) మంజూరు చేసింది. ఇదివరకే భవానీపురంలో నమోదైన కేసులో విజయవాడ ఎక్సైజ్ కోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండు కేసుల్లోనూ బెయిల్ లభించడంతో జోగి రమేష్ సోదరులు త్వరలోనే జైలు నుంచి విడుదల కానున్నారు.
2025 నవంబర్ 2వ తేదీన జోగి రమేష్ సోదరులను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి విజయవాడ, నెల్లూరు జైళ్లలో 82 రోజుల పాటు వారు రిమాండ్‌లో ఉన్నారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో లభ్యమైన నకిలీ మద్యం కేసుతో పాటు, భవానీపురంలో లభించిన నకిలీ మద్యం కేసుల్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు అద్దేపల్లి జనార్దన్‌రావు, తంబళ్లపల్లి టీడీపీ ఇన్‌చార్జ్ జయచంద్రారెడ్డి పేర్లు బయటపడ్డాయి. అయితే, ఈ కేసులో కీలకంగా పేర్లు వినిపిస్తున్నప్పటికీ, తంబళ్లపల్లి టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డిని ఇప్పటివరకు కనీసం విచారణకు కూడా పిలవకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అనూహ్యంగా కస్టడీలో ఉన్న జనార్దన్‌రావుతో వీడియో విడుదల చేయించిన అనంతరం జోగి సోదరులను అరెస్ట్ చేశారు.
తాము ఎలాంటి తప్పు చేయలేదని జోగి రమేష్ కుటుంబ సభ్యులు విజయవాడ దుర్గమ్మ ఆలయంలో సత్య ప్రమాణం చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. గతంలో చంద్రబాబు ఇంటి ముట్టడికి యత్నించిన నేపథ్యంలో తనపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కుట్రపూరితంగా అరెస్ట్ చేశారని జోగి రమేష్ ఇప్పటికే ఆరోపించారు. గత మూడు రోజుల క్రితం భవానీపురం కేసులో బెయిల్ లభించగా, ఇవాళ తంబళ్లపల్లి కేసులో కూడా బెయిల్ మంజూరు కావడంతో జోగి రమేష్ సోదరులకు 82 రోజుల అనంతరం భారీ ఊరట దక్కింది.








