జార్ఖండ్ రాష్ట్రంలోని చైబాసాలో ఘోర ప్రమాదం జరిగింది. జగన్నాథ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పువాల్ గ్రామంలో మంటలు చెలరేగి నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదం ఊహించని విషాదాన్ని మిగిల్చింది.
మంటల్లో చిక్కుకున్న చిన్నారులు
పోలీసుల వివరాల ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో చిన్నారులు గడ్డివాము దగ్గర ఆడుకుంటున్నారు. అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడటంతో వారు బయటకు రావడానికి వీలులేకుండా పోయింది. ఈ భయానక ఘటనలో ఐదు సంవత్సరాల లోపు వయసున్న నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే చిన్నారులు సజీవదహనమయ్యారు. గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.








